నమస్తే. నా పేరు రెడ్డి తాతయ్యబాబు. నేను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో నాలుగు దశాబ్దాల పాటు పని చేసి, ప్రస్తుతం కొవ్వూరులోని నా స్వగృహమందు విశ్రాంత జీవితం గడుపుతున్నాను.

శ్రీ గారపాటి వీర్రాజు గారితో నా పరిచయం కొన్ని విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. నేను చేరిన తర్వాత కొన్ని సంవత్సరాలకు, శ్రీహరికోటలో ఉద్యోగంలో చేరిన వారి కుమారుడు సూర్యనారాయణ కంటే ముందుగానే వీర్రాజు గారి పరిచయ భాగ్యం కలగడం నిజంగా విచిత్రమే మరి. ఇక విషయానికి వస్తే... షార్ కేంద్రంలోని నాకు అత్యంత ఆప్తుడైన ఒక మిత్రుడు ఒకరోజు నన్ను కలిసి, తన చెల్లెలి వివాహ సంబంధం విషయంలో నా మధ్యవర్తిత్వం కోరడం జరిగింది. కుర్రాడు షార్ లోనే పని చేస్తున్నాడని, అమలాపురం పట్టణానికి చెందిన వాడని, అబ్బాయి తండ్రితో కలిసి సంబంధం ఖాయం చేసుకుని రావాల్సిందిగా చెప్పి, వివరాలు ఇచ్చారు. అమలాపురం నాకు క్రొత్త. వివాహ సంబంధాలు మాట్లాడేందుకు అర్హత లేని మూడు పదుల వయస్సు నాది. అయినా బయలుదేరి, బస్టాండులో దిగాక, అక్కడ కనపడిన ఒక వ్యక్తిని గారపాటి వీధికి వెళ్ళేందుకు మార్గం చెప్పమని అడిగాను. ఎవరి ఇంటికి వెళ్ళాలని, ఆ వ్యక్తి అడగడంతో గారపాటి వీర్రాజు మాష్టారి ఇంటికి అని చెప్పాను. అంతే, ఆ క్షణం నుండి పరిస్థితి మారిపోయింది. ఆ వ్యక్తి స్వయంగా నా వెంట వచ్చి ఇల్లు చూపడం, ఆ సమయంలో మాష్టారు ఇంట్లో లేకపోవడంతో.. ఆయన ఎక్కడ ఉంటారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారికి విషయం తెలిపి, తనతో తీసుకొని వచ్చి నాకు అప్పగించి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. దీనిలో కొసమెరుపు ఏమిటంటే, ఆ వ్యక్తికి వీర్రాజు మాష్టారితో పరిచయం అంతంత మాత్రమే. అయినా గాని, మాష్టారి పేరు విన్న వెంటనే ఆ వ్యక్తి స్పందించిన తీరుతో వీర్రాజు గారి పరపతి ఏమిటో అర్థమయ్యింది నాకు. ఇంకో ముఖ్య విషయం.. నేను ఎందుకు వచ్చానో తెలియక పోయినా, మాష్టారి కోసం రావడంతో వారు వచ్చే లోపు వారి ఇంట్లో కోనసీమ ఆతిథ్యం రుచి చూసాను నేను.

పరిచయ కార్యక్రమం తర్వాత విషయానికి వచ్చాను. ఒక మిత్రునికి సహాయం చేయడానికి అంత దూరం నుంచి వచ్చినందుకు నన్ను అభినందిస్తూనే, అసలు సంగతి చెప్పారు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరిన తన కుమారుడు, తన కోరిక నెరవేర్చడం కోసం ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడని, ఇంకో రెండేళ్ళు వదిలేస్తే ప్రశాంతంగా డిగ్రీ పూర్తి చేస్తాడని‌ చెబుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వివాహం జరిపించడం మంచి పని కాదని అంటూ 'వివాహం విద్యా నాశనం' అనే సామెతను గుర్తు చేశారు. 'ఇటువంటి పరిస్థితిలో ఉంటే మీరెటువంటి సలహా ఇస్తారు' అంటూ బంతిని నా కోర్టులో వదిలేసారు. ఇంకేం చేస్తాం, ఆయనతో ఏకీభవించి సెలవు కోరడం తప్ప!! పెండ్లి సంబంధం మాట్లాడడానికి పెద్దమనిషిగా వెళ్ళి, మాష్టారి వాదంతో ఏకీభవించి తిరిగి వచ్చిన నన్ను చూసి నా సదరు మిత్రుడు అసహనానికి గురి అయిన సంగతి వేరే చెప్పనవసరం లేదు కదూ. ఆరోజు మాష్టారితో జరిగిన సంభాషణ ద్వారా, ఆయన విద్యకు ఎంత విలువ ఇస్తారో అర్థమయ్యింది నాకు. నా వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా, వారు నాకు నా మాటలకు ఇచ్చిన విలువతో మానవ సంబంధాల పట్ల మాష్టారికున్న ప్రాముఖ్యత అర్థమయ్యింది నాకు.

అంతటి మహనీయుని కుమారుడైన సూర్యనారాయణ పట్ల నాకు అత్యంత ఆసక్తి కలిగి, తనను పరిచయం చేసుకోవడం, ఆ‌ తర్వాతి కాలంలో నాకున్న ఆప్తమిత్రులలో ఒకడు కావడం, ఇద్దరం కలిసి అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడం, రిటైర్ అయ్యాక కూడా అదే అనుబంధాన్ని కొనసాగించడం... తదుపరి పరిణామాలు. మేము షార్ లో పని చేస్తున్న కాలంలో సూర్యనారాయణ గారి ఇంటికి వచ్చిన మొదట్లో నా గురించి వాకబు చేసి నన్ను కలిసి వెళ్ళేవారు మాష్టారు. తర్వాతి కాలంలో వారు వచ్చినప్పుడల్లా నేను ఆయనను కలవడం నాకు అలవాటుగా మారింది. నాతోనే కాదు, సూర్యనారాయణ గారి మిత్రులందరి తోనూ వారి అనుబంధం ప్రత్యేకమైనది. తనకు తెలిసిన వారందరినీ కలవకుండా సూళ్లూరుపేట వదిలేవారు కాదు మాష్టారు. ఆ పరిచయాల‌ ప్రభావంలోని గాఢత ఆ తర్వాతి రోజుల్లో అర్థమైంది నాకు.

ఎప్పుడూ వచ్చినట్లుగానే ఒక పర్యాయం సూర్యనారాయణ ఇంటికి వచ్చారు మాష్టారు. ఈసారి వారి శ్రీమతి తోనే కాక, తన మరో కుమారుడు, కోడలు, ఇద్దరు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళతో కలిసి వచ్చారు. షిర్డీ, తిరుమల, మొదలైన పుణ్య క్షేత్రాలు దర్శించి అలసిపోయారు. ఒక రోజు, సూర్యనారాయణ నుండి వర్తమానం... రెండు రోజులుగా షార్ హాస్పిటల్ లో ఉన్న నాన్నగారి ఆరోగ్యం కుదుట పడలేదని, చెన్నై ఆసుపత్రికి తీసుకుని వెడుతున్నానని. ఆరోజు చెన్నై వెళ్ళే అంబులెన్స్ లో వారిని కలుసుకుని అందరికీ ధైర్యం చెప్పిన నాకు అప్పుడు తెలియదు, మాష్టారితో అదే నా చివరి కలయిక అని. ఆ తర్వాత మూడు రోజులకు సూర్యనారాయణ ఇచ్చిన సమాచారం నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అదే సమయంలో మాష్టారు గారి అదృష్టానికి కూడా ఆశ్చర్యపోయాను నేను. నిజమే, తన అంతిమ ఘడియల్లో పుణ్య తీర్థ సందర్శనం, అయిన వాళ్ళందరి మధ్య ఆనందంగా గడపడం.. ఎంతమందికి ఆ అరుదైన అవకాశం దొరికుతుంది చెప్పండి. పార్థివ దేహాన్ని సూళ్లూరుపేట తీసుకుని వచ్చే సమయం లేదు గనుక నేరుగా అమలాపురం తీసుకుని వెడుతున్నామని సూర్యనారాయణ చెప్పడంతో, హైవే లోని సూళ్లూరుపేట బైపాస్ జంక్షన్ లో మాష్టారి సన్నిహితులు కోసం కొంత సేపు వాహనాన్ని ఆపమని నేను కోరడం జరిగింది. ఎలా తెలిసిందో ఏమో, వాహనం అక్కడికి చేరుకొనే సరికి ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా వారి అంతిమ దర్శనార్థం అసంఖ్యాకంగా చేరుకున్న

మా మిత్రుల్ని చూసి మతి పోయింది నాకు. సూర్యనారాయణ కి కూడా తెలియనంత మంది అభిమానులు వారికున్నారన్న విషయం ఆరోజు అర్థమైంది నాకు.

సూర్యనారాయణ కంటే ముందుగానే నేను రిటైర్ అయ్యి కొవ్వూరు లో సెటిల్ అయ్యాక, తన రిటైర్మెంట్ ముందు సూర్యనారాయణ చెప్పిన విషయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తన తండ్రి గారి పేరు మీద కుటుంబ సభ్యుల, మిత్రుల సహకారంతో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని ఆయన తీసుకున్న నిర్ణయం... ఆ మహోన్నత వ్యక్తిత్వానికి అచ్చమైన నివాళి. ఆయన తెలిపినట్లుగానే ట్రస్టును 2021 సం.లో స్థాపించడం, 2022 సం. నుండి కార్యక్రమాలు ప్రారంభించడం, గత మూడేళ్ళుగా ముగ్గురు విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉండడం, రాబోయే కాలంలో మరింత మందికి సాయం అందించేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం... ఖచ్చితంగా మాష్టారు గారి ఆశీర్వాద బలమే. 2024 సం. ట్రస్టు జరిపిన రెండో వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాబోయే కాలంలో ట్రస్టు ద్వారా మరిన్ని మంచి పనులు జరగాలని, ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఈ ట్రస్టు ద్వారా లబ్ది పొందాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.

శ్రీ గారపాటి వీర్రాజు మాష్టారిని చూడని వారికి, ఆయనతో ప్రత్యక్ష అనుభవం లేని వారికి... మాస్టారి లక్షణాలను పుష్కలంగా పుణికిపుచ్చుకున్న సూర్యనారాయణ లో వారిని చూసుకోవచ్చని మనఃపూర్వకంగా హామీ ఇస్తూ...