నా పేరు విజయ కుమార్ బొలిశెట్టి. నేను అమెరికాలోని చికాగో సిటీలో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాను.
ముందుగా 'గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్' ద్వారా మనందరినీ ఒక వేదిక మీదకు తీసుకు వచ్చినందుకు వారి కుమారుడు గారపాటి సూర్యనారాయణ (బోసు బాబు బాబాయి) గారికి ధన్యవాదములు.
తాత గారితో (స్వర్గీయ శ్రీ గారపాటి వీర్రాజు గారితో) నా అనుబంధం 1982 సం.లో గారపాటి వీధి ప్రాధమిక పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థిగా మొదలయింది. ఆ మహనీయుని దగ్గర ఓనమాలు నేర్చుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఆ పాఠశాలలోని మధ్యాన్న భోజన పథకంలో విద్యార్థులందరికీ దగ్గరుండి మరీ ఆయన వడ్డించడం నాకు బాగా గుర్తుంది. చదువుకోవడం వల్ల సమకూరే ప్రయోజనాలను ఆ రోజుల్లో చిన్న చిన్న కథల రూపంలో విద్యార్థులకు అర్ధమయ్యేట్టుగా చెప్పేవారు. ఆర్ధికంగా అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాకు, బాగా చదువుకోవాలనే బీజం పడింది ఆ పాఠశాలలో తాతగారి కథల వల్లనే.
ఐదవ తరగతి పూర్తి చేసి ఆ పాఠశాలను వదిలేసినా, గారపాటి వీధిలోని వారి ఇంటి మీదుగా వెడుతున్న నన్ను పిలిచి ఇంటి అరుగు మీద కూర్చోపెట్టి నా చదువు గురించి వాకబు చేసిన సందర్భాలు, వాళ్ళ అబ్బాయి బోసు బాబు (బాబాయి షార్ కేంద్రంలో పని చేసే రోజులవి) గురించి చెబుతూ, ఇస్రో నుంచి తెచ్చిన రాకెట్ నమూనాలని చూపిస్తూ చదువు మీద నాకు మరింత ఆసక్తిని పెంచి ప్రోత్సహించిన సందర్భాలు జ్ఞాపకాలుగా నా మదిలో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
మా బామ్మగారు స్వర్గీయ బొలిశెట్టి వేంకట నరసమ్మ గారికి తాతగారు అంటే చాలా గౌరవం. నా ఉన్నత చదువుల కోసం ఆవిడ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును ఆర్ధిక సాయం చేసే విషయంలో మా బామ్మ గారిని ఒప్పించింది తాతగారే.
నేను ఉన్నత చదువులు చదివే రోజుల్లో అకడమిక్ ప్రాజెక్ట్ చెయ్యాల్సిన విషయం తెలుసుకుని, బోసు బాబాయి ద్వారా నాకు షార్ కేంద్రంలో అకడమిక్ ప్రాజెక్ట్ ఇప్పించడంలో ఆయన చేసిన కృషి నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. తన నాన్నగారికి ఇచ్చిన మాట మరియు ఆయన మీద ఉన్న గౌరవంతో, సూళ్ళూరుపేటకి నేను వెళ్ళినది మొదలుకొని ప్రాజెక్ట్ పూర్తి చేసే వరకు బోసు బాబాయి నన్ను చూసుకున్న విధానం నాకు ఎంతో స్ఫూర్తిదాయకం.
ఒక వ్యక్తి చదువు, ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని తాతగారు చెప్పిన పాఠం నిత్య సత్యం.
తాతగారి కలల్ని గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టు ద్వారా ముందుకు తీసుకెళ్తున్న బోసు బాబాయికి, ఈ ట్రస్టులో భాగస్వాములైన అందరికీ నా ధన్యవాదములు.